భారతదేశం, ఏప్రిల్ 1 -- Vemulawada Works: వేములవాడకు నూతన ఆధ్యాత్మిక శోభను తీసుకురావడానికి కృషి చేస్తున్నామని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్ ప్రకటించారు. వేములవాడలో కోటి 36 లక్షల 50 వేలతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తో కలిసి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రూ.76 కోట్లతో రాజన్న ఆలయ విస్తీర్ణకు ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు.

వేములవాడ లో రాజన్న భక్తులు సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న మూడో బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నామని ఆది శ్రీనివాస్ తెలిపారు. బ్రిడ్జి భూ సేకరణకు రూ.6 కోట్ల నిధులు కేటాయించడం జరిగిందన్నారు. కాంట్రాక్టర్లను ఒప్పించి పనులు ప్రారంభించామని తెలిపారు. రూ. 47 కోట్లతో రోడ్డు వెడల్పు చేయబోతున్నామని వివరించారు...